పోలింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు.. కౌంటింగ్‌పై ప్రత్యేక దృష్టి!
సమస్యాత్మక కేంద్రాల్లో అదనపు బలగాలు, ప్రత్యేక నిఘా… 48 గంటల ముందు నుంచే ఎన్నికల ప్రచారంపై ఆంక్షలు… 12 గంటల్లోపు ఫలితాల వెల్లడికి ప్రణాళిక సిద్ధం చేయాలి: అనిల్ చంద్ర పునేఠా…

విజయవాడ, అక్టోబర్ 30: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. శుక్రవారం ఐజీ రాజకుమారి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి మల్లికార్జునతో కలిసి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లు, భద్రత, సిబ్బంది రవాణా తదితర అంశాలపై సమీక్షించారు. తుఫాను ప్రభావిత పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి ఇటీవల తుఫాను ప్రభావానికి గురైన ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని పునేఠా ఆదేశించారు. భవనాలకు జరిగిన నష్టాలను వెంటనే సరిచేసి పోలింగ్‌కు అనువుగా తీర్చిదిద్దాలన్నారు. శనివారం ఉదయం 10 గంటల్లోపు అన్ని పోలింగ్ కేంద్రాల భౌతిక తనిఖీలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, సిబ్బందికి అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాల్లో రద్దీ తలెత్తకుండా క్యూలైన్లు ఏర్పాటు చేయడంతోపాటు సిబ్బంది రవాణాకు వాహనాలు, రూట్ చార్టులను ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. సున్నిత కేంద్రాలపై పోలీసుల డేగకన్ను సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించాలని ఆదేశించారు. ఓటు రహస్యతకు భంగం కలగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మైక్రో అబ్జర్వర్ల పనితీరును పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు సేకరించాలన్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి సైలెంట్ పీరియడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, ఎన్నికల ప్రచారం, మద్యం సరఫరాపై నిషేధాన్ని పటిష్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. స్థానిక ఓటర్లు కాని రాజకీయ నాయకులు, బయటి వ్యక్తులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆయా ప్రాంతాల్లో ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గెస్ట్ హౌస్‌లు, కల్యాణ మండపాలు, ఇతర వసతి కేంద్రాలను తనిఖీ చేయాలని సూచించారు. 12 గంటల్లో ఫలితాలే లక్ష్యం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన 12 గంటల్లోపు ఫలితాలు ప్రకటించే లక్ష్యంతో ముందస్తు ప్రణాళిక రూపొందించాలని పునేఠా ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ల నిర్వహణలో నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియపై ఓటర్లలో విశ్వాసం పెరిగేలా పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని అధికారులకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్టీఆర్ జిల్లా నుంచి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ, ఎన్నికల వ్యయ పరిశీలకులు బి.విజయకుమార్ జెడ్పీ సీఈఓ పి.సుశీల, డీపీఓ సీతామహాలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

