అమరవీరుల త్యాగాలకు కొవ్వొత్తుల వెలుగుతో నివాళి
విజయవాడ ఎంజీ రోడ్డులో పోలీసుల క్యాండిల్ ర్యాలీ… విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవల స్మరణ… అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ అండగా ఉంటుంది: డీసీపీ సరిత…

విజయవాడ, అక్టోబర్ 30: విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఎన్టీఆర్ జిల్లా పోలీసులు శుక్రవారం సాయంత్రం విజయవాడలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఎంజీ రోడ్డులోని డీ అడ్రస్ మాల్ వద్ద ప్రారంభమైన ర్యాలీ వ్యాస్ కాంప్లెక్స్‌లోని దివంగత కె.ఎస్. వ్యాస్ విగ్రహం వరకు కొనసాగింది. పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు కొవ్వొత్తులు చేతబట్టి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీసీపీ కె.జి.వి. సరిత మాట్లాడుతూ దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలు చిరస్మరణీయమన్నారు. 1959 అక్టోబర్ 21న లద్దాఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న పది మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చైనా సైనికుల దాడిలో ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. వారి త్యాగాలకు గుర్తుగా ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరించుకోవడంతోపాటు వారి కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందనే భరోసా కల్పించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని సరిత పేర్కొన్నారు. ఈ ఏడాది ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులను స్మరించుకుంటూ కమిషనర్ నుంచి కానిస్టేబుల్ వరకు అందరూ క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారని తెలిపారు. అమరవీరుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, తిరుమలేశ్వరరెడ్డి, షిరిన్ బేగం, కె.జి.వి. సరిత, ఏ.బి.టి.ఎస్. ఉదయారాణి, కృష్ణప్రసన్నతోపాటు అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

