72, 81వ డివిజన్లలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం
కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా విస్తృత ప్రచారం… ప్రజలతో మమేకమైన టీడీపీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ… ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపు…

పాయకాపురం, అక్టోబర్ 30: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 72, 81వ డివిజన్లలో శుక్రవారం ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ కూటమి అభ్యర్థులకు మద్దతుగా స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 72వ డివిజన్లోని లోటస్ మెయిన్ గేట్ వద్ద సుబ్బరాజు విగ్రహం నుంచి ప్రచారం ప్రారంభించారు. అనంతరం 81వ డివిజన్ ప్రశాంతినగర్‌లో బీజేపీ, జనసేన బలపరిచిన టీడీపీ అభ్యర్థి పందిరి నాగమణికి మద్దతుగా డివిజన్ పార్టీ కార్యాలయం వద్ద నుంచి నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. నాయకులు,కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పందిరి వాసు, జలకం రాజారావు, ఆకుల సూర్యప్రకాశ్, వింజమూరి సతీష్, కృపారావు, వరలక్ష్మి, ఎస్వీఆర్, జటాధర్ తదితరులు పాల్గొన్నారు.

