వైసీపీకి ఒక్క ఓటు వేసినా దండగే: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
నందివాడ మండలంలో జోరుగా కూటమి ఎన్నికల ప్రచారం… బుడమేరు వరదల్లో ప్రతిపక్ష నాయకులు ఎక్కడున్నారని ప్రశ్న… 2024 ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయాలని పిలుపు…

నందివాడ, అక్టోబర్ 30: ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే నాయకులకు ఓటుతో గుణపాఠం చెప్పాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. వైసీపీకి ఒక్క ఓటు వేసినా దండగేనని, ఊహించని పరాజయం ఎదురైతేనే ఆ పార్టీ నాయకులకు బుద్ధి వస్తుందని ఘాటుగా విమర్శించారు. శుక్రవారం నందివాడ మండలంలోని అరిపిరాల, పొలాసివారిపాలెం, పుట్టగుంట, జొన్నపాడు, తుమ్మలపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీ అభ్యర్థి దుడ్ల ప్రదీప్ కుమార్‌తో పాటు ఎంపీటీసీ అభ్యర్థులను సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎస్‌డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, కూటమి నాయకులతో కలిసి గ్రామాల్లో పర్యటించారు. పలుచోట్ల ప్రజలు ఘన స్వాగతం పలకగా మహిళలు మంగళహారతులతో ఆశీర్వదించారు. అంబేడ్కర్ విగ్రహాలకు నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆలయాల్లో పూజలు, చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ చంద్రబాబాబును, తనను నమ్మి గెలిపించిన నాటి నుంచి ప్రజలకు అండగా ఉంటున్నామని తెలిపారు. బుడమేరు వరదల సమయంలో కూటమి నాయకులు ప్రజల మధ్య ఉండి సహాయక చర్యల్లో పాల్గొన్నారని, అప్పట్లో ప్రతిపక్ష నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ప్రజలకు సహాయం చేయడానికి అధికారం అవసరమా అని నిలదీశారు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవని నాయకులను తిరిగి ఎందుకు ఎన్నుకోవాలని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వైసీపీకి చెందిన పలువురికి కూడా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించామని పేర్కొన్నారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కకుండా ఓడించాలని, 2024 ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అభ్యర్థి దుడ్ల ప్రదీప్ కుమార్, ఎంపీటీసీ అభ్యర్థులు కుంటం సిలువ, మద్దాల ఇస్సాక్, గాదిరెడ్డి కోటేశ్వరమ్మ, సాదం నాగమల్లేశ్వరి, మండల టీడీపీ అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, నాయకులు పిన్నమనేని బాబ్జి, సింగాల రాధాకృష్ణ, యార్లగడ్డ రవి, మజ్జాడ నాగరాజు, తాతినేని మురళి తదితరులు పాల్గొన్నారు.

