అమ్మవారి అన్నప్రసాదం.. భక్తుల ప్రశంసలు
నాణ్యత, పరిశుభ్రతతో ఉచిత అన్నప్రసాదాల పంపిణీ… దసరా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు… ఈవో శీనా నాయక్ పర్యవేక్షణలో సేవలు…

విజయవాడ, అక్టోబర్ 20: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రికి విచ్చేస్తున్న భక్తులకు అందిస్తున్న ఉచిత అన్నప్రసాదాలు, అన్నప్రసాద విభాగంలో కల్పించిన సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యమైన ఆహార పదార్థాలతో, పరిశుభ్రమైన వాతావరణంలో అన్నప్రసాదాలను అందిస్తున్నారని కొనియాడారు. సోమవారం అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అన్నప్రసాదాలను స్వీకరించిన పలువురు భక్తులు మాట్లాడుతూ.. భోజన ఏర్పాట్లు బాగున్నాయని తెలిపారు. సిబ్బంది ఓర్పుతో వ్యవహరిస్తూ, అవసరమైన సహకారం అందిస్తున్నారని ప్రశంసించారు. ఈవో నిరంతర పర్యవేక్షణ అన్నప్రసాద విభాగంలో ఏర్పాట్లు, భక్తులకు అందుతున్న సేవలను ఆలయ ఈవో శీనా నాయక్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆహార నాణ్యత, పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ భక్తులందరికీ సంతృప్తికరమైన సేవలు అందించాలని సంబంధిత అధికారులకు సూచిస్తున్నారు. అన్నప్రసాదాల పంపిణీలో సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమని భక్తులు పేర్కొన్నారు. ఆలయ ఈవోతోపాటు అన్నప్రసాద విభాగ అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
