డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరపాలి: అన్నవరపు ఎలిజబెత్ రాణి
అక్రమాలపై విచారణ లేదా విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్... స్పోర్ట్స్ కోటా నియామకాలపై అనుమానాలు వ్యక్తం చేసిన వైఎస్సార్సీపీ నాయకురాలు... విద్యార్థులు, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం...

V10 TV | గన్నవరం
డీఎస్సీ-2025 నియామకాలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ తక్షణమే సీబీఐతో విచారణ జరిపించాలని, లేదంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని గన్నవరం మండలం జెడ్పీటీసీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు అన్నవరపు ఎలిజబెత్ రాణి డిమాండ్ చేశారు.
డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా పేరుతో అర్హత లేని వారికి ఉద్యోగాలు కల్పించారంటూ ఆమె ఆరోపించారు. ఇలాంటి నియామకాల వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అర్హత ఉన్న అభ్యర్థులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని, జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరగాలని కోరారు.
అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన హామీల అమలుపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. డీఎస్సీ అంశంపై నిరసనలు తెలుపుతున్న వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థులు, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని అన్నవరపు ఎలిజబెత్ రాణి స్పష్టం చేశారు

