ఘనంగా రెడ్డి కులస్తుల ఆత్మీయ సమావేశం!
వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని వెలంపల్లి పిలుపు… నగర అభివృద్ధికి రాయన భాగ్యలక్ష్మిని మేయర్గా గెలిపించాలి… 34, 37, 38, 39, 40 డివిజన్ల అభ్యర్థులకు మద్దతు కోరిన మాజీ మంత్రి…

విజయవాడ, అక్టోబర్ 25: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో రెడ్డి సామాజికవర్గ ఆత్మీయ సమావేశం ఆదివారం సాయంత్రం శివాలయం సెంటర్లోని కొండవీడు అకాడమీలో ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ నగర సమగ్ర అభివృద్ధికి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మితోపాటు 34వ డివిజన్ అభ్యర్థి యరడ్ల ఆంజనేయరెడ్డి, 37వ డివిజన్ అభ్యర్థి పువ్వాడ చిన్న వెంకటేశ్వరరావు, 38వ డివిజన్ అభ్యర్థి పప్పుల రమణరెడ్డి, 39వ డివిజన్ అభ్యర్థి బండారి వసంతకుమారి, 40వ డివిజన్ అభ్యర్థి అల్లం భువన్కుమార్లను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నగర ప్రజలు వైఎస్సార్సీపీని ఆదరించి, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి, ఆయా డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులు, రెడ్డి సామాజికవర్గ ప్రముఖులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

