ఆటో డ్రైవర్ల డిమాండ్లపై నేడు ఉన్నతస్థాయి భేటీ
సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం... సంక్షేమ బోర్డు, మీటర్ ఛార్జీలు, అగ్రిగేటర్ పాలసీపై ప్రధాన చర్చ... రీట్రోఫిట్మెంట్‌కు రూ.1.50 లక్షల ఆర్థిక సహాయంపైనా సమీక్ష...

హైదరాబాద్, సెప్టెంబరు 7: ఆటో కార్మికుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కీలక సమావేశం నిర్వహించనుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట్‌స్వామి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది.
ఈ సమావేశానికి వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు ఆటో కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఆటో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు.
ప్రధానంగా ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు, అగ్రిగేటర్ పాలసీపై యూనియన్ల ప్రతిపాదనలు, ఆటో మీటర్ ఛార్జీల పెంపు వంటి అంశాలు సమావేశంలో చర్చకు రానున్నాయి. అదేవిధంగా డీజిల్, పెట్రోల్ ఆటోలను ఇతర ఇంధన విధానాలకు మార్చే రీట్రోఫిట్మెంట్ కోసం రూ.1.50 లక్షల ఆర్థిక సహాయం అందించే అంశంపైనా సమీక్షించనున్నారు. ఈ సహాయానికి ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో అమలు విధానంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
గత నెల 23న ఆటో యూనియన్ల జేఏసీ ప్రతినిధులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాటిపై వివిధ శాఖల సమన్వయంతో సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిశీలిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. డ్రైవర్లకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరేలా తగిన నిర్ణయాలు తీసుకునే దిశగా చర్చ జరగాలని ఆయన అధికారులకు సూచించారు.
సమావేశానికి సంబంధిత అంశాలపై పూర్తి సమాచారంతో హాజరు కావాలని ఉన్నతాధికారులను ఆదేశించడంతో పాటు ఆటో యూనియన్ల జేఏసీ ప్రతినిధులను కూడా ఆహ్వానించాలని రవాణా శాఖ కమిషనర్‌కు మంత్రి సూచించారు.

