అక్షర విద్యాలయానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
వెంకటాచలంలో ఘన స్వాగతం... విద్యార్థులతో ముచ్చటించనున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి... స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవాల్లో ముఖ్య అతిథిగా హాజరు...

నెల్లూరు, సెప్టెంబరు 7: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని అక్షర విద్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్షర విద్యాలయం అర్జున్ మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న అనంతరం ఆయన పర్యటన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
పర్యటనలో భాగంగా అక్షర విద్యాలయ ప్రాంగణంలోని సోమా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను యోగి ఆదిత్యనాథ్ సందర్శించనున్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించడంతో పాటు విద్యాలయంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను పరిశీలించనున్నారు.
తర్వాత వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌కు చేరుకుని 25వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
యోగి ఆదిత్యనాథ్ పర్యటన నేపథ్యంలో అక్షర విద్యాలయం, స్వర్ణభారత్ ట్రస్ట్ పరిసరాల్లో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. హెలిప్యాడ్, కార్యక్రమ వేదికలు, వాహనాల రాకపోకలు, ప్రముఖుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు.

