కొత్త పింఛన్ల నమోదు తప్పుల తడక
50 ఏళ్లకే బీసీలకు రూ.4 వేల పింఛన్ హామీ అమలు చేయాలి... చేతివృత్తిదారులు, సంప్రదాయ కళాకారులకు సామాజిక భద్రత కల్పించాలి... వైఎస్సార్‌సీపీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తోలేటి శ్రీకాంత్ డిమాండ్...

విజయవాడ, సెప్టెంబరు 7: ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల నమోదు ప్రక్రియలో చేతివృత్తిదారులు, సంప్రదాయ కళాకారులకు సంబంధించి స్పష్టత లేదని వైఎస్సార్‌సీపీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తోలేటి శ్రీకాంత్ విమర్శించారు. ఎన్నికల సమయంలో బీసీలకు 50 ఏళ్ల వయస్సు నుంచే నెలకు రూ.4 వేల పింఛన్ ఇస్తామని కూటమి ఇచ్చిన హామీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం కొత్త పింఛన్ల ఎంపికకు ప్రకటించిన వివరాల్లో అనేక చేతివృత్తుల వారికి స్పష్టమైన ప్రాతినిధ్యం లేదని ఆయన పేర్కొన్నారు. చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మంగలి, రజక, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, చెప్పుల తయారీదారులు, పశువుల కాపరులు, గ్రామీణ కళాకారులు తదితర వర్గాల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరారు. చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న బీసీ వర్గాలను ప్రత్యేక కేటగిరీ కింద గుర్తించాలని డిమాండ్ చేశారు.
కొండపల్లి బొమ్మల కళాకారులు, ఏటికొప్పాక చెక్క బొమ్మల తయారీదారులు, స్వర్ణకారులు, బొబ్బిలి వీణ తయారీదారులు, కలంకారి చిత్రకారులు, తోలుబొమ్మల కళాకారులు, చెక్క, రాతి శిల్పకారులు, వెదురు–బెత్తం కళాకారులు, బుట్టలు–చాపలు తయారు చేసేవారు, మట్టి కళాకారులు, సంప్రదాయ సంగీత వాయిద్యాలు, పడవల తయారీదారులు తదితరులను కూడా సంప్రదాయ కళాకారులుగా గుర్తించి సామాజిక భద్రత కల్పించాలని కోరారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చేతివృత్తుల కింద ఏయే వృత్తులు వస్తాయనే అంశంపై ప్రభుత్వం ప్రత్యేక అధికారిక జాబితా విడుదల చేయాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు. అర్హులైన బీసీ చేతివృత్తిదారులకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛన్ అమలు చేయడంతో పాటు ఆధునిక పనిముట్లు, తక్కువ వడ్డీ రుణాలు, శిక్షణ, మార్కెటింగ్ సదుపాయాలు, ప్రభుత్వ కొనుగోళ్లలో ప్రాధాన్యం కల్పించాలని కోరారు.
‘ఆదరణ’ పథకాన్ని విస్తరించి అన్ని సంప్రదాయ చేతివృత్తిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ‘జగనన్న చేదోడు’, ‘జగనన్న తోడు’ పథకాల ద్వారా చేతివృత్తిదారులు, చిరు వ్యాపారులకు అందించిన సహాయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.
‘‘చేతివృత్తిదారుడు బతికితేనే వృత్తి బతుకుతుంది.. వృత్తి బతికితేనే సంప్రదాయం బతుకుతుంది.. సంప్రదాయం బతికితేనే మన సంస్కృతి బతుకుతుంది’’ అని శ్రీకాంత్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకుని రాష్ట్రంలోని అర్హులైన చేతివృత్తిదారులు, గ్రామీణ, సంప్రదాయ కళాకారులందరికీ సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

