గ్రామాల అభివృద్ధే ధ్యేయం
ఆముదార్లంకలో దాదాపు రూ.కోటితో అభివృద్ధి పనులు... రూ.85.70 లక్షలతో నిర్మించిన ఏడు సీసీ రోడ్లు ప్రారంభం... గ్రామాలకు మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం: ఎమ్మెల్యే బుద్ధప్రసాద్...

చల్లపల్లి, సెప్టెంబరు 7 : గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. సోమవారం చల్లపల్లి మండలం ఆముదార్లంకలో దాదాపు రూ.కోటి నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.
‘పల్లె పండుగ-1’లో భాగంగా రూ.85.70 లక్షలతో 1.45 కిలోమీటర్ల మేర నిర్మించిన ఏడు సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎస్సీ కాలనీలో మండల పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.9 లక్షలతో ఏర్పాటు చేసిన నూతన మంచినీటి పైప్‌లైన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కృష్ణానదికి వరదలు వచ్చిన ప్రతిసారీ నదీగర్భ గ్రామాల్లో సహాయక చర్యలకు రహదారుల సమస్య ఎదురవుతోందన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ‘పల్లె పండుగ-1’లో ఉపాధి హామీ నిధులతో నదీగర్భ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు.
అవనిగడ్డ నియోజకవర్గంలో ‘పల్లె పండుగ-1’ కింద రూ.31.65 కోట్లతో 45.6 కిలోమీటర్ల మేర 462 సీసీ రోడ్లు నిర్మించినట్లు వెల్లడించారు. ‘పల్లె పండుగ-2’ నిధులతో దాదాపు 15 కిలోమీటర్ల మేర తారు రోడ్లు నిర్మించామని, రాబోయే ‘పల్లె పండుగ-3’లో రైతులకు కీలకమైన డొంక రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు.
ఆముదార్లంక భౌగోళికంగా బాపట్ల జిల్లాలో ఉన్నప్పటికీ నియోజకవర్గ పరిధిలోని గ్రామంగా ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని పేర్కొన్నారు. గ్రామాల్లో ఐక్యత ఉంటే అభివృద్ధి మరింత వేగంగా సాధ్యమవుతుందన్నారు. రహదారుల నిర్మాణానికి సహకరించిన గ్రామ పెద్ద వేములపల్లి రాఘవేంద్రరావును అభినందించారు.
అనంతరం గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌ను గ్రామ పెద్దలు, టీడీపీ, జనసేన నాయకులు సత్కరించారు. కార్యక్రమంలో మండలి వెంకట్రామ్, తోట కనకదుర్గ, మోర్ల రాంబాబు, యార్లగడ్డ శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఆనందకుమారి, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
