లారీ డ్రైవర్‌పై రవాణాశాఖ అధికారి డ్రైవర్ దాడి!
గాజువాక షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద ఘటన... వాహనం ఆపలేదంటూ లారీని వెంబడించిన రవాణాశాఖ ఇన్స్పెక్టర్ పార్వతి... ఇన్స్పెక్టర్ సమక్షంలోనే డ్రైవర్‌పై దాడి జరిగిందని ఆరోపణ.. ధర్నాకు సిద్ధమవుతున్న లారీ అసోసియేషన్ సభ్యులు...

విశాఖపట్నం, ఆగస్టు 24: గాజువాక పరిధిలో లారీ డ్రైవర్‌పై రవాణాశాఖ ఇన్స్పెక్టర్కు చెందిన డ్రైవర్ దాడి చేశాడన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద తనిఖీల సమయంలో వాహనాన్ని ఆపలేదనే కారణంతో లారీని రవాణాశాఖ ఇన్స్పెక్టర్ పార్వతి వాహనం వెంబడించినట్లు సమాచారం.
లారీని నిలిపిన అనంతరం ఇన్స్పెక్టర్ పార్వతి సమక్షంలోనే ఆమె వాహన డ్రైవర్, లారీ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో లారీ డ్రైవర్‌పై పిడిగుద్దులతో దాడి చేయడంతో అతనికి రక్తగాయాలైనట్లు లారీ అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు.
వాహన తనిఖీల్లో ఏవైనా నిబంధనల ఉల్లంఘనలు జరిగితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉండగా, డ్రైవర్‌పై భౌతిక దాడికి పాల్పడటం ఏమిటని లారీ అసోసియేషన్ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ అధికారి సమక్షంలోనే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు తీవ్రంగా స్పందించారు. లారీ డ్రైవర్‌పై విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపిస్తూ నిరసన, ధర్నా చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.
అయితే ఘటనకు దారితీసిన పరిస్థితులు, లారీని ఎందుకు నిలిపేందుకు ప్రయత్నించారు, దాడి ఆరోపణలపై రవాణాశాఖ ఇన్స్పెక్టర్ పార్వతి లేదా సంబంధిత అధికారుల వివరణ తెలియాల్సి ఉంది.

