ఆపదలో అండగా CMRF.. అర్హులందరికీ భరోసా
ప్రజా వేదికలో సీఎంఆర్‌ఎఫ్ దరఖాస్తులను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కులం, మతం, పార్టీ తేడా లేకుండా ప్రతి అర్హుడికీ సహాయం అందేలా కృషి గుడివాడ నియోజకవర్గానికి రికార్డు స్థాయిలో సీఎంఆర్‌ఎఫ్ నిధులు తీసుకొచ్చామని వెల్లడి

గుడివాడ, ఆగస్టు 24: అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థిక భరోసాగా నిలుస్తోందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎంఆర్‌ఎఫ్ సాయం అందేలా తన వంతు కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. గుడివాడ ఏలూరు రోడ్డులోని ప్రజా వేదిక కార్యాలయంలో సోమవారం నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, ప్రాంతాల నుంచి సీఎంఆర్‌ఎఫ్ సహాయం కోసం వచ్చిన బాధితులు ఎమ్మెల్యే రామును కలిశారు. వారి దరఖాస్తులను ఆయన స్వయంగా పరిశీలించారు. అవసరమైన పత్రాలు పూర్తిగా లేని దరఖాస్తుదారులకు వాటిని సమర్పించాలని సూచించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము వారి ఆరోగ్య పరిస్థితి, జరుగుతున్న చికిత్స, వైద్య ఖర్చుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సూచనలు పాటించాలని చెప్పారు. అనారోగ్యం కారణంగా పేద కుటుంబాలు అప్పులపాలు కాకుండా ప్రభుత్వ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. కులం, మతం, పార్టీ అనే తేడా లేకుండా అర్హతే ప్రామాణికంగా ప్రతి బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇప్పటికే గుడివాడ నియోజకవర్గానికి రికార్డు స్థాయిలో సీఎంఆర్‌ఎఫ్ నిధులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, అర్హతకు సంబంధించిన పత్రాలను పరిశీలించి ప్రభుత్వ సహాయం త్వరగా అందేలా కృషి చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేద కుటుంబాలకు వైద్యపరంగా అండగా నిలుస్తోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి సహాయనిధి ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికీ చేరేలా నిరంతరం పనిచేస్తామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు పిన్నమనేని బాబ్జి, తేనెల ఏడుకొండలు, మళ్లీ పెద్ది సుబ్రహ్మణ్యం, అరిపిరాల రవి, భద్రయ్య, నంబూరి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

