దీపావళి వేళ ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి!
గచ్చిబౌలిలో విషాద ఘటన… పల్నాడు జిల్లాకు చెందిన దంపతులు, కుమారుడు మృతి… ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసుల దర్యాప్తు…

హైదరాబాద్, నవంబర్ 10 : దీపావళి పండుగ వేళ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం తాళ్లచెరువు గ్రామానికి చెందిన మల్లారెడ్డి (65), ఆయన భార్య భారతి (60), కుమారుడు నిశాంత్ రెడ్డి (38) హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉరేసుకొని మృతి చెందినట్లు సమాచారం. అందిన వివరాల ప్రకారం నిశాంత్ రెడ్డి కొంతకాలంగా అనారోగ్యం, మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కుటుంబంలో విభేదాలు తలెత్తినట్లు సమాచారం. కుమారుడి పరిస్థితిపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురైనట్లు చెబుతున్నారు. దీపావళి రోజున ముగ్గురూ మృతి చెందడంతో స్వగ్రామమైన తాళ్లచెరువులో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ముగ్గురి మృతికి దారితీసిన కారణాలు, ఘటనకు ముందు చోటుచేసుకున్న పరిణామాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

