ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు!
బుధవారం బాపట్ల–విశాఖ మధ్య తీరం దాటే అవకాశం… గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు… కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక…

విజయవాడ, అక్టోబర్ 26: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బలపడుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉంది. బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా మారి, మధ్యాహ్నానికి బాపట్ల–విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచనలున్నాయన్నారు. మంగళ, బుధవారాల్లో కృష్ణా, ఎన్టీఆర్ సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. సహాయక చర్యల కోసం ఏడు ఎన్డీఆర్ఎఫ్, ఎనిమిది ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించినట్లు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

