పులివెందులలో కొడితే.. రాష్ట్రమంతా మోగాలి: జగన్ సంచలన వ్యాఖ్యలు!
పోలింగ్ ముందు రోజు పులివెందులకు వస్తా.. ఓటు వేసి చూపిస్తా: జగన్ సవాల్... మా కార్యకర్తలపై చేయి వేస్తే నాపై వేసినట్లే.. ఏ అధికారినీ వదిలిపెట్టం... పులివెందులలో కొడితే ఆ సౌండ్ రాష్ట్రమంతా మోగాలి: మాజీ సీఎం జగన్...

కడప, అక్టోబర్ 28: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పులివెందుల రాజకీయాలు మరింత వేడెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చొక్కా చేతులు మడిచి చూపిస్తూ ఎంతమంది వస్తారో రండంటూ సవాల్ విసిరారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ముందు రోజు రాత్రి పులివెందులకు వస్తానని, పోలింగ్ రోజు స్వయంగా ఓటు వేస్తానని ప్రకటించారు. మంగళవారం పులివెందులలో నిర్వహించిన సమావేశంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. తిరగబడండి.. అండగా నేనుంటా! ప్రజాస్వామ్యంలో తమ హక్కులను కాపాడుకునేందుకు ప్రతి కార్యకర్త ధైర్యంగా నిలబడాలని జగన్ పిలుపునిచ్చారు. అన్యాయాలను ఎదిరించేందుకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పులివెందులలో తమ పార్టీ శ్రేణులు చూపించే ప్రతిఘటన రాష్ట్రవ్యాప్తంగా ప్రతిధ్వనించాలని వ్యాఖ్యానించారు. తనకు కష్టమొచ్చినప్పుడు అండగా నిలిచేది పులివెందుల ప్రజలేనని, వారి కోసం ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలబడతానని స్పష్టం చేశారు. పోలీసులకు జగన్ తీవ్ర హెచ్చరిక పులివెందులలో వైసీపీ కార్యకర్తలపై పోలీసులు అన్యాయంగా వ్యవహరిస్తే సహించేది లేదని జగన్ హెచ్చరించారు. తమ కార్యకర్తలపై చేయి వేస్తే తనపై చేయి వేసినట్లేనని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అధికార బలంతో వ్యవహరిస్తున్న అధికారులు భవిష్యత్తులో సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏ అధికారినీ వదిలిపెట్టబోమని, వడ్డీతో సహా చెల్లిస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శకునిలా చంద్రబాబు రాజకీయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మహాభారతంలోని శకునితో పోలుస్తూ జగన్ విమర్శలు గుప్పించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. పులివెందుల మున్సిపాలిటీలో మొత్తం 40 వార్డులుండగా కేవలం 20 వార్డుల్లోనే వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయనిచ్చారని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఏడు జడ్పీటీసీ స్థానాల్లో నాలుగింటిలో మాత్రమే నామినేషన్లు వేయగలిగామని తెలిపారు. మహిళా అభ్యర్థులపై దాడులు చేసి, నామినేషన్ పత్రాలను చించివేశారని కూటమి నాయకులపై జగన్ ఆరోపించారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు, రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. అయితే ఈ ఆరోపణలపై ప్రభుత్వం, పోలీసుల స్పందన తెలియాల్సి ఉంది. వచ్చేది జగన్ 2.0 ప్రభుత్వం వచ్చే ఏడాది సెప్టెంబరులో తన పాదయాత్ర ప్రారంభమవుతుందని జగన్ ప్రకటించారు. ఆ తర్వాత ఏడాదికి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఏర్పడేది జగన్ 2.0 ప్రభుత్వమని, అందులో జగన్ ఒకటైతే కార్యకర్త రెండని వ్యాఖ్యానించారు. కార్యకర్తలకు ఎదురయ్యే ప్రతి సమస్యను తన సొంత సమస్యగా భావించి పోరాడతానని భరోసా ఇచ్చారు.

