వర్షం తగ్గినా.. తుఫాన్ ముప్పు తొలగలేదు!
అర్ణబ్ ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం హైఅలర్ట్... లోతట్టు, కొండ ప్రాంతాల ప్రజల రక్షణకు ప్రత్యేక చర్యలు... విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు: కలెక్టర్ లక్ష్మీశ...

విజయవాడ, అక్టోబర్ 28: అర్ణబ్ తుఫాన్ ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. వర్షం తగ్గినంత మాత్రాన తుఫాన్ ముప్పు తొలగిపోయినట్లు భావించరాదని హెచ్చరించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో తీవ్ర ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అధికారులు అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా తుఫాన్ ప్రభావం, క్షేత్రస్థాయి పరిస్థితులను కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అవసరమైనప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని ఆదేశించారు. చెట్లు విరిగిపడినా, విద్యుత్ స్తంభాలు నేలకొరిగినా, రహదారులపై రాకపోకలు నిలిచిపోయినా సంబంధిత శాఖల సిబ్బంది యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సూచించారు. నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని నిర్దేశిత స్ప్రెడ్షీట్లో వెంటనే నమోదు చేయని సిబ్బందిపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుఫాన్ సహాయక చర్యలను ముఖ్యమంత్రి కార్యాలయం నిరంతరం పర్యవేక్షిస్తున్నందున అధికారులు అప్రమత్తత కోల్పోవద్దని స్పష్టం చేశారు. విద్యుత్, తాగునీరు, రవాణా వ్యవస్థలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టడంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. ముఖ్యంగా గర్భిణులు, అత్యవసర వైద్యసేవలు అవసరమైన వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. నరసాపురానికి 30 కిలోమీటర్ల దూరంలో అర్ణబ్ మరోవైపు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ బుధవారం ఉదయం 7.30 గంటలకు విడుదల చేసిన సమాచారం ప్రకారం అర్ణబ్ తుఫాన్ తీరం దాటే ప్రక్రియ రెండు గంటలుగా దాదాపు నిలకడగా కొనసాగుతోంది. తుఫాన్ కేంద్రం నరసాపురానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉందని, మధ్యాహ్నానికి పూర్తిగా తీరం దాటే అవకాశముందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు, వర్షాలు కొనసాగవచ్చని హెచ్చరించారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తుఫాన్ ప్రభావం ముగిసేవరకు లోతట్టు, కొండ ప్రాంతాల ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని, అధికారుల సూచనలు పాటిస్తూ సహాయక చర్యలకు సహకరించాలని జిల్లా యంత్రాంగం కోరింది.

