విజయవాడ నుంచి కాశీకి నేరుగా!
గన్నవరం నుంచి వారణాసికి ఇండిగో నూతన విమాన సర్వీసు ప్రారంభం... మంగళ, గురు, శనివారాల్లో సర్వీసు.. కాశీ యాత్రికులకు మరింత సౌకర్యం.. నేరుగా విమాన కనెక్టివిటీతో తగ్గనున్న ప్రయాణ సమయం.. ఆధ్యాత్మిక పర్యాటకానికి ఊతం...

వీ10టీవీ విజయవాడ, ఆగస్టు 14: కాశీ విశ్వనాథుడిని దర్శించుకునేందుకు వెళ్లే ఆంధ్రప్రదేశ్ భక్తులకు శుభవార్త. విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసికి నేరుగా విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఇండిగో సంస్థ ఏర్పాటు చేసిన ఈ నూతన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వర్చువల్గా ప్రారంభించారు.
వారణాసి–విజయవాడ మధ్య విమానాలు వారంలో మూడు రోజులు మంగళవారం, గురువారం, శనివారం నడవనున్నాయి. ఇప్పటివరకు కాశీ వెళ్లేందుకు ఇతర నగరాల్లో విమానాలు మారాల్సి వచ్చిన ప్రయాణికులకు ఈ నేరుగా సర్వీసుతో ఆ ఇబ్బంది తప్పనుంది. ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గి భక్తులకు మరింత సౌకర్యం కలగనుంది.
విజయవాడ నుంచి వారణాసికి నేరుగా విమాన సర్వీసు ప్రారంభం కావడం ఆధ్యాత్మిక పర్యాటకానికి మరింత ఊతమిస్తుందని అధికారులు పేర్కొన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల నుంచి కాశీ వెళ్లే ప్రయాణికులకు ఈ సర్వీసు ప్రయోజనకరంగా మారనుంది.
ప్రాంతీయ విమాన కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడంతో పాటు టైర్-2, టైర్-3 నగరాలను ప్రధాన గమ్యస్థానాలతో అనుసంధానించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. కొత్త సర్వీసుతో విజయవాడ విమానాశ్రయం నుంచి దేశంలోని కీలక నగరాలకు కనెక్టివిటీ మరింత విస్తరించనుంది.

