మెడికల్ కౌన్సిల్లో పారదర్శకత ఏదీ?
నకిలీ వైద్యులపై చర్యల్లో జాప్యమెందుకు?.. ఎన్నికైన సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.. రిజిస్ట్రార్‌కు వైఎస్సార్సీపీ వైద్య విభాగం వినతి..

విజయవాడ, నవంబర్ 16: ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో ప్రజాస్వామ్య విలువలు, పారదర్శకతను కాపాడాలని వైఎస్సార్సీపీ వైద్య విభాగం డిమాండ్ చేసింది. సోమవారం కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ సారా సెర్మిష్టను వైద్య విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్, కార్యదర్శి డాక్టర్ ప్రభుదాస్ కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో నకిలీ వైద్యులపై యాంటీ క్వాకరీ కమిటీ నివేదికలు సమర్పించినప్పటికీ చర్యల్లో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. అనంతపురంలో నకిలీ వైద్యం కారణంగా మరణం సంభవించినట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. పెండింగ్ ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కౌన్సిల్ ఏర్పాటైన ఆరు నెలల్లోనే ఎన్నికైన సభ్యుడు డాక్టర్ ఎం. వెంకటరమణ రాజీనామా చేయడం ఆందోళనకరమన్నారు. జనరల్ బాడీ సమావేశాల నిర్వహణ, కమిటీల కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలని కోరారు. జీవో 81 అమలుపైనా సమగ్ర చర్చ జరగాలన్నారు. ఎన్నికైన, నామినేటెడ్ సభ్యులందరికీ అభిప్రాయాలు వెల్లడించే అవకాశం కల్పించి, కౌన్సిల్‌పై వైద్యుల విశ్వాసాన్ని కాపాడాలని డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ విజ్ఞప్తి చేశారు.

