ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అండ
రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించిన మంత్రి టీజీ భరత్ వైద్య ఖర్చులతో పాటు మెడికల్ పీజీ ఫీజు భరిస్తామని హామీ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం

రాజమండ్రి ఘటనలో మృతి చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి వెళ్లిన మంత్రి టీజీ భరత్ ప్రియాంక మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె తండ్రి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.20 లక్షల ఆర్థిక సాయం చెక్కును ప్రియాంక తండ్రికి మంత్రి అందజేశారు. ప్రియాంక మృతి అత్యంత బాధాకరమని పేర్కొన్న ఆయన, ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుని చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రియాంక చికిత్స పొందిన సమయంలో ఆసుపత్రిలో అయిన వైద్య ఖర్చులతో పాటు ఆమె మెడికల్ పీజీ సీటుకు సంబంధించిన ఫీజు ఖర్చులను కూడా ప్రభుత్వం తరఫున అందిస్తామని మంత్రి తెలిపారు. ఈ కష్ట సమయంలో ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

