తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు సరికొత్త భద్రత
దేశంలోనే తొలిసారిగా 102 వాహనాల్లో అత్యాధునిక సదుపాయాలుతొలిదశలో 300 ...వాహనాలు సిద్ధం... త్వరలో మరో 200 వాహనాలుమంగళవారం నరసరావుపేటలో ప్రారంభించనున్నమంత్రి సత్యకుమార్ యాదవ్...

అమరావతి, ఆగస్టు 10: తల్లులు, నవజాత శిశువుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘102 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలకు సరికొత్త రూపునిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో దేశంలోనే తొలిసారిగా ఈ వాహనాల్లో అత్యాధునిక భద్రతా సదుపాయాలను కల్పిస్తోంది. మొత్తం 500 వాహనాలను సమకూర్చుతుండగా, తొలిదశలో 300 వాహనాలను సిద్ధం చేసింది. మిగిలిన 200 వాహనాలను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. నూతన వాహన సేవలను మంగళవారం నరసరావుపేటలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లి, నవజాత శిశువును ఆసుపత్రి నుంచి ఇంటికి చేర్చే సేవను ఉచితంగా అందించనున్నారు. తల్లితో పాటు ఇద్దరు సహాయకులు ప్రయాణించే అవకాశం ఉంటుంది. అధిక ప్రమాద గర్భిణులు, తీవ్ర రక్తహీనతతో రక్తమార్పిడి అవసరమైన వారికి ప్రత్యేకంగా రవాణా సేవలు అందించనున్నారు. మాతా, శిశు మరణాలను తగ్గించడమే ఈ సేవల ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. కొత్త వాహనాల్లో ఆరు ఎయిర్‌బ్యాగులు, సీట్‌బెల్టులు, ప్రత్యేక ఫుట్‌రెస్టులు, హ్యాండ్‌రెయిల్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, చైల్డ్‌లాక్ స్లైడింగ్ డోర్లు, వేగ హెచ్చరిక వ్యవస్థ, అగ్నిమాపక పరికరాలతో పాటు నవజాత శిశువులకు అనుకూలమైన ఉష్ణోగ్రత ఉండేలా ఏసీ సదుపాయం కల్పించారు. గర్భిణి కూర్చునే సీటు వద్ద అత్యవసర ఎస్‌ఓఎస్ బటన్‌ను కూడా ఏర్పాటు చేశారు. వాహనాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు జీపీఎస్ ట్రాకింగ్, ద్వంద్వ సిమ్ సదుపాయం, నెట్‌వర్క్ లేని సమయంలో సమాచారాన్ని భద్రపరిచే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రయాణ సమయంలో తల్లి, శిశు సంరక్షణ, తల్లిపాలు, పోషణ, టీకాలు, ఆరోగ్య జాగ్రత్తలపై ఆడియో ద్వారా సూచనలు అందించే ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని ఏ ఫోన్ నుంచైనా టోల్‌ఫ్రీ 102కు కాల్ చేసి ఈ సేవలకు సంబంధించిన సమాచారం పొందవచ్చు. 2025–26లో 102 సేవల ద్వారా మొత్తం 2,05,914 ప్రయాణాలు నిర్వహించగా, వాటిలో 1,65,093 ప్రసవానంతర డ్రాప్‌బ్యాక్ ప్రయాణాలు, 40,821 అధిక ప్రమాద గర్భిణుల రవాణా సేవలు ఉన్నాయి. 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఈ సేవల కోసం ప్రభుత్వం రూ.37.40 కోట్ల ప్రతిపాదిత బడ్జెట్‌ను కేటాయించింది.
