క్రిమినల్ కేసుల కాపీల్లో కీలక మార్పు
మూడో పక్షానికీ సర్టిఫైడ్ కాపీలు అందేలా కొత్త రూల్ 212-ఏ... రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి సిఫారసు చేసిన హైకోర్టు రిజిస్ట్రార్... ప్రజాప్రయోజన వ్యాజ్యంలో పిటిషనర్ తరఫున జడ శ్రవణ్ వాదనలు...

అమరావతి: క్రిమినల్ కేసులకు సంబంధించిన కోర్టు నిర్ధారిత కాపీలను మూడో పక్షం వారు పొందే అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్‌లో రూల్ నంబర్ 212-ఏను రూపొందించినట్లు హైకోర్టు రిజిస్ట్రార్ విచారణ సందర్భంగా ధర్మాసనం ముందు మెమో దాఖలు చేశారు. ఈ రూల్‌ను ఆమోదించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు పేర్కొన్నారు. క్రిమినల్ కేసుల్లో మూడో పక్షం వారికి సర్టిఫైడ్ కాపీలు అందకపోవడాన్ని సవాల్ చేస్తూ మాజీ రైల్వే ఉద్యోగి వేము కొండలరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది జడ శ్రవణ్ వాదనలు వినిపించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్‌లోని రూల్ 212 కారణంగా మూడో పక్షం వారికి అవసరమైన క్రిమినల్ కేసు పత్రాలను పొందడంలో పరిమితులు ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు సంబంధించిన క్రిమినల్ కేసుల్లో పారదర్శకతకు ఇది అడ్డంకిగా మారుతోందని వాదించారు. గత విచారణ సందర్భంగా ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు రిజిస్ట్రార్ ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనానికి తెలిపిన నేపథ్యంలో తాజాగా రూల్ 212-ఏను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపినట్లు మెమో ద్వారా వెల్లడించారు. కొత్త రూల్ అమల్లోకి వస్తే క్రిమినల్ కేసులకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీలను మూడో పక్షం వారు పొందేందుకు మార్గం సుగమమవుతుందని, తద్వారా కేసుల వ్యవహారాల్లో పారదర్శకత మరింత పెరుగుతుందని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ పేర్కొన్నారు.

