విజయవాడ అభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించాలి
దేశ రాజకీయాల్లో మార్పు రావాలి.. బీజేపీని గద్దె దించాలి: దోనేపూడి శంకర్... ‘బద్లావ్ జరూరీ హై–మార్పు కావాలి’ పేరుతో విజయవాడలో సీపీఐ పాదయాత్ర... ఎన్నికల విధానం, ప్రజాస్వామ్య పాలనలో మార్పు రావాలని డిమాండ్...

విజయవాడ: దేశ రాజకీయాల్లో మార్పు రావాలని, ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తప్పించాలని సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు చేపట్టిన ‘బద్లావ్ జరూరీ హై–మార్పు కావాలి’ ప్రచార పాదయాత్రలో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలోని జోడు బొమ్మల సెంటర్ నుంచి పంజా సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, ఎన్నికల విధానం, ఆర్థిక విధానాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని శంకర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని ఆరోపిస్తూ, వాటికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడలో కొండ ప్రాంతాల అభివృద్ధి, ఇళ్ల పట్టాలు, రోడ్లు, మెట్లు, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కల్పనలో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేసే అభ్యర్థులను ఆదరించాలని కోరారు. విజయవాడ నగర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం వెంటనే రూ.50 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అవసరమైన ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణం, విద్యాధరపురం లేబర్ కాలనీలో స్టేడియం, కొండ ప్రాంతాల్లోని ఇళ్లకు నామమాత్రపు ధరకు రిజిస్ట్రేషన్ తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే మరింత భారీ ఉద్యమాలకు సిద్ధమవుతామని సీపీఐ నేతలు హెచ్చరించారు.

