ఏపీకి రూ.80 వేల కోట్ల భారీ పెట్టుబడులు!
గ్రీన్ డేటా సెంటర్‌కు రూ.67 వేల కోట్లు కేటాయించనున్న రిన్యూ… పాలీసిలికాన్ తయారీ రంగంలో రూ.11 వేల కోట్ల పెట్టుబడులు… రాంబిల్లిలో రూ.1,500 కోట్లతో శాశ్వత అయస్కాంతాల తయారీ కేంద్రం…

విశాఖపట్నం, నవంబర్ 12 (ఆంధ్రప్రభ): ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులకు ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ రిన్యూ (ReNew) ముందుకొచ్చింది. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా రాష్ట్రంలో సుమారు రూ.80 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు గురువారం ప్రకటించింది. డిజిటల్ మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ, సోలార్ తయారీ రంగాల్లో ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ వెల్లడించింది. అనకాపల్లి జిల్లాలో ఒక గిగావాట్ సామర్థ్యంతో గ్రీన్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు రూ.67 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. పునరుత్పాదక విద్యుత్ ఆధారంగా పనిచేసే ఈ డేటా సెంటర్ ద్వారా డిజిటల్ మౌలిక సదుపాయాల రంగానికి ఊతం లభించనుంది. అలాగే అనకాపల్లి, నెల్లూరు జిల్లాల్లో పాలీసిలికాన్, మెటలర్జికల్ గ్రేడ్ సిలికాన్ తయారీ పరిశ్రమల కోసం రూ.11 వేల కోట్ల పెట్టుబడులు ప్రతిపాదించింది. దేశీయ సోలార్ పరికరాల తయారీ రంగాన్ని బలోపేతం చేయడం ఈ ప్రాజెక్టుల లక్ష్యమని సంస్థ పేర్కొంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ.1,500 కోట్ల వ్యయంతో శాశ్వత అయస్కాంతాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించింది. ఈ పరిశ్రమ మార్చి 2029 నాటికి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు పీఎం సేతు పథకం కింద విశాఖపట్నంలో రిన్యూ సెంటర్ ఫర్ టెక్నికల్ ఎక్సలెన్స్ (RCTE) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. గాజువాక పరిధిలోని ఐదు ఐటీఐల సముదాయాన్ని అభివృద్ధి చేసి, పునరుత్పాదక ఇంధనం, ఆధునిక తయారీ రంగాల్లో యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక శిక్షణ అందించనుంది. ఈ సందర్భంగా రిన్యూ సంస్థ చైర్మన్, సీఈవో సుమంత్ సిన్హా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ మౌలిక సదుపాయాలు, స్వచ్ఛ ఇంధన తయారీ రంగాల్లో మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ పెట్టుబడుల ప్రణాళికలతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి అవకాశాల విస్తరణకు తోడ్పాటు లభిస్తుందని పేర్కొన్నారు.

