ఐదేళ్లుగా ఆగని అన్నదాన సేవ!
60 నెలలుగా నిరంతరాయంగా అన్నదానం చేస్తున్న కళ్ళే లలిత ట్రస్ట్… పేదల ఆకలి తీర్చడమే తమ లక్ష్యమంటున్న ట్రస్ట్ అధ్యక్షుడు నాగేశ్వరరావు… అన్నదానంతో పాటు విద్య, వైద్యం, స్వయం ఉపాధికి చేయూత…

పాయకాపురం, నవంబర్ 12 :
పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా స్వర్గీయ కళ్ళే లలిత ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. అజిత్‌సింగ్‌నగర్‌లోని కళ్ళే లలిత వీధిలో గత 60 నెలలుగా ప్రతి నెలా 12వ తేదీన క్రమం తప్పకుండా అన్నసమారాధన నిర్వహిస్తూ ట్రస్ట్ నిరుపేదలకు అండగా నిలుస్తోంది. గురువారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అన్నార్తులు తరలివచ్చి భోజనాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు కళ్ళే నాగేశ్వరరావు తొలుత స్వర్గీయ కళ్ళే లలిత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ స్వర్గీయ కళ్ళే లలిత భౌతికంగా దూరమైన నాటి నుంచి ఆమె ఆశయాలను కొనసాగించాలనే సంకల్పంతో ప్రతి నెలా 12వ తేదీన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేదలకు స్వీట్లు, గారెలు, చికెన్, గుడ్డు, సాంబారు, పెరుగు, పచ్చడితో కూడిన రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నామన్నారు. ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టడంలోనే నిజమైన సంతృప్తి ఉందని పేర్కొన్నారు. అన్నదానంతో పాటు ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, సైకిళ్ల పంపిణీ, ఏడాది పొడవునా చల్లని తాగునీరు అందించేందుకు కూలింగ్ ఫ్రిజ్‌తో చలివేంద్రం ఏర్పాటు, పారిశుధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ, చెత్త సేకరణకు డస్ట్బిన్ల అందజేత వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే నిరుపేద రోగులకు ఉచితంగా మందులు, భోజనం అందించడంతో పాటు పేద మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు తోపుడు బండ్లను పంపిణీ చేసినట్లు వివరించారు. సేవా కార్యక్రమాలకు ఎలాంటి విరామం లేకుండా భవిష్యత్తులోనూ మరింత విస్తృతంగా కొనసాగిస్తామని నాగేశ్వరరావు తెలిపారు. నిరుపేదలకు అండగా నిలవడమే కళ్ళే లలిత ట్రస్ట్ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్లు కళ్ళే సీతామహాలక్ష్మి, ముప్పూరి హరీష్, జయదుర్గా, ఎం. జశ్విన్, జి. ధ్రువన్, మాజీ కార్పొరేటర్ చందన సురేష్, సీహెచ్. అనిల్, ప్రసాద్ తదితరులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

