క్లీన్ సిటీ ఘనతపై కమిషనర్‌కు ఏఐటీయూసీ అభినందనలు
జాతీయస్థాయిలో విజయవాడకు మూడో స్థానం దక్కడంపై హర్షం… కమిషనర్ ధ్యానచంద్ర కృషిని అభినందించిన కార్మిక సంఘాల నేతలు… స్వచ్ఛత సాధనలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమని ప్రశంసలు…

విజయవాడ, నవంబర్ 12 : జాతీయస్థాయిలో విజయవాడ నగరం మూడో క్లీన్ సిటీగా గుర్తింపు సాధించి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఐఏఎస్‌కు ఏఐటీయూసీ నాయకులు అభినందనలు తెలిపారు. గురువారం కమిషనర్ చాంబర్లో విజయవాడ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి బుద్దె రాజా, అధ్యక్షుడు ఎస్వీఎస్ చలం, మినిస్టీరియల్ అండ్ ఆల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్ కమిషనర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నగరాన్ని స్వచ్ఛత, పచ్చదనంలో ముందంజలో నిలిపేందుకు కమిషనర్ ధ్యానచంద్ర చేసిన కృషి అభినందనీయమన్నారు. నగరానికి జాతీయస్థాయిలో గుర్తింపు రావడం వెనుక అధికారులు, ఉద్యోగులు, కార్మికుల సమష్టి కృషి ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య, పార్కులు, ఇంజనీరింగ్ విభాగాల కార్మికులు నిరంతరం అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడంలో ప్రతి కార్మికుడి భాగస్వామ్యం ఉందని తెలిపారు. భవిష్యత్తులో విజయవాడ నగరం స్వచ్ఛతలో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం అదనపు కమిషనర్ (జనరల్) రవీంద్రను యూనియన్ నాయకులు కలిసి దుశ్శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకుడు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

