వన్‌టౌన్ వీధుల్లో మైనర్ల హల్చల్!
చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధుల్లో మైనర్ల డ్రైవింగ్‌తో ఆందోళన.. తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో పొంచి ఉన్న ప్రాణాపాయం.. ప్రమాదాలు జరిగితే బాధ్యులెవరు..?

విజయవాడ, నవంబర్ 16: బెజవాడ వన్‌టౌన్ పరిధిలో మైనర్ల ద్విచక్ర వాహనాల డ్రైవింగ్ ఆందోళన కలిగిస్తోంది. చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి, నెహ్రూ బొమ్మ సెంటర్, మిల్క్ ప్రాజెక్ట్ పరిసరాల్లో లైసెన్స్ లేని బాలురు ద్విచక్ర వాహనాలతో రద్దీ రహదారులపై తిరుగుతున్నారనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. ఇరుకు వీధుల్లో అతివేగంగా వాహనాలు నడపడం పాదచారులకు, ఇతర వాహనదారులకు ప్రమాదకరంగా మారుతోంది. తల్లిదండ్రులదే బాధ్యత.. పాఠశాలలు, కళాశాలలు, ట్యూషన్లకు వెళ్లేందుకు పిల్లలకు వాహనాలు అందిస్తున్న తల్లిదండ్రులు ప్రమాదాలను గుర్తించాలని స్థానికులు సూచిస్తున్నారు. మైనర్లు చట్టవిరుద్ధంగా వాహనాలు నడిపితే మోటారు వాహనాల చట్టం ప్రకారం వాహన యజమానులు, సంరక్షకులపై భారీ జరిమానాలు, జైలు శిక్ష వంటి చర్యలకు అవకాశం ఉంది. ఒక్క ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపే ప్రమాదముందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రత్యేక తనిఖీలు చేపట్టాలి.. మైనర్ల డ్రైవింగ్‌ను నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టడంతో పాటు పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా రద్దీ కూడళ్లలో నిఘా పెంచి ప్రమాదాలకు ముందే అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

