దుర్గమ్మకు కాణిపాకం ఆలయం నుంచి పట్టువస్త్రాలు
దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి సారె సమర్పణ... ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రికి ఆలయ బృందం... ఆలయ బృందానికి ఘనస్వాగతం పలికిన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్...

విజయవాడ, అక్టోబర్ 11: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం తరఫున ఆదివారం సాయంత్రం పట్టువస్త్రాలు సమర్పించారు. కాణిపాకం దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెంచల కిషోర్ ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తలు, అర్చకులు ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి పట్టువస్త్రాలు, సారె అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ బృందానికి దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ స్వాగతం పలికారు. అనంతరం బృందం సభ్యులకు అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు.

