ఇంద్రకీలాద్రిపై మార్మోగిన జయజయధ్వానాలు!
ఆశ్వయుజ పౌర్ణమి వేళ వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ… మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, భజన సంకీర్తనలతో ఆధ్యాత్మిక శోభ… అమ్మవారి నామస్మరణతో గిరి చుట్టూ ప్రదక్షిణ చేసిన వేలాది మంది భక్తులు…

ఆశ్వయుజ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లు కొలువైన పవిత్ర ఇంద్రకీలాద్రి పరిసరాలు భక్తుల జయజయధ్వానాలతో మార్మోగాయి. మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్చారణలు, భజన సంకీర్తనలు, సంప్రదాయ కోలాట ప్రదర్శనల నడుమ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఘాట్‌రోడ్డు ప్రవేశ మార్గంలోని శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి వద్ద ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయస్వామి తదితర దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేయడం అత్యంత శ్రేష్ఠమని పండితులు పేర్కొంటున్నారు. ఘాట్‌రోడ్డు, కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పాలఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణవీధి మీదుగా తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదక్షిణ సాగింది. మార్గమధ్యంలో పలుచోట్ల స్థానిక మహిళలు పసుపు నీళ్లతో రహదారులను శుద్ధి చేసి, స్వామివార్ల వాహనానికి హారతులు ఇచ్చి కొబ్బరికాయలు సమర్పించారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళాబృందాల కోలాట ప్రదర్శనలు, భజనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గిరి ప్రదక్షిణ మార్గమంతా భక్తులకు అమ్మవారి కుంకుమ, ప్రసాదాలను ఆలయ సిబ్బంది అందజేశారు. వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణలో పాల్గొని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో కిషోర్ కుమార్, సూపరింటెండెంట్ హేమదుర్గాంబ, సీనియర్ అసిస్టెంట్ శిరీష తదితరులు పాల్గొన్నారు.

