బోటు ప్రమాదంలో ఏడుగురు జాలర్ల మృతి.. పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం
మురసు తుపాను అలజడిలో సముద్రంలో మునిగిన తమిళనాడు మత్స్యకారుల బోటు... తొమ్మిది మందిలో ఏడుగురి మృతదేహాలు లభ్యం.. మరో ఇద్దరి ఆచూకీ గల్లంతు... కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసుల సమన్వయంతో గాలింపు ముమ్మరం చేయాలని ఆదేశం...

ప్రకాశం, నవంబర్ 6 : మురసు తుపాను ప్రభావంతో సముద్రంలో నెలకొన్న అలజడి కారణంగా తమిళనాడుకు చెందిన మత్స్యకారుల బోటు మునిగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద వివరాలను ప్రకాశం జిల్లా కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద సమయంలో బోటులో తొమ్మిది మంది మత్స్యకారులు ఉండగా, ఇప్పటివరకు ఏడుగురి మృతదేహాలు లభ్యమయ్యాయని, మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉందని కలెక్టర్ వివరించారు. గల్లంతైన ఇద్దరి కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు, స్థానిక మత్స్యకార బృందాలు సమన్వయంతో పనిచేసి గాలింపు కొనసాగించాలని సూచించారు. లభ్యమైన మృతదేహాల గుర్తింపు, పోస్టుమార్టం ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి స్వస్థలాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తుపాను హెచ్చరికలు ఉన్న సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సముద్రంలో అలల ఉద్ధృతి, వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. ఇలాంటి విషాదకర ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు.

