ముత్యాలమ్మ సన్నిధిలో బొండా సిద్ధార్థ ప్రత్యేక పూజలు
భక్తిశ్రద్ధలతో ముగిసిన అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు... అన్నసంతర్పణలో పాల్గొని భక్తులకు ప్రసాదాలు అందజేసిన బొండా సిద్ధార్థ... ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందుతాయని వెల్లడి...

విజయవాడ, నవంబర్ 6 : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 61వ డివిజన్ కస్తూరిబాయిపేటలో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నసంతర్పణ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువనేత బొండా సిద్ధార్థ పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ నగరం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించారు. అనంతరం అన్నసంతర్పణలో పాల్గొని భక్తులకు స్వయంగా ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో దేవాలయాలకు విశిష్ట స్థానం ఉందన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. అన్నదానం అత్యంత పవిత్రమైన సేవా కార్యక్రమమని, ఇటువంటి కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో నిరంతరం కొనసాగించాలని ఆకాంక్షించారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు, మహిళలు, భక్తులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

