వదిన హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో 2024లో జరిగిన హత్య కేసు... బంగారు హరిపై నేరం రుజువు.. రూ.1,000 జరిమానా... 9 మంది సాక్షుల విచారణ అనంతరం మహిళా సెషన్స్ కోర్టు తీర్పు...

విజయవాడ క్రైమ్, సెప్టెంబరు 7 (ఆంధ్రప్రభ): వదినను హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ మహిళా సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది. పటమట పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైం నంబర్ 71/2024, సెక్షన్ 302 ఐపీసీ కేసులో విజయవాడ పటమట రెల్లి కాలనీకి చెందిన బంగారు హరి (42)పై నేరం రుజువైనట్లు కోర్టు నిర్ధారించింది.
పోలీసుల వివరాల ప్రకారం, యర్రంశెట్టి లక్ష్మికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె బంగారు దుర్గకు సుమారు 20 ఏళ్ల క్రితం సమీప బంధువుతో వివాహం జరిగింది. చిన్న కుమార్తెను కూడా అదే కుటుంబానికి చెందిన మరో వ్యక్తికి వివాహం చేశారు. పెద్ద కుమార్తె దుర్గ తన భర్తతో మనస్పర్థల కారణంగా సుమారు మూడు సంవత్సరాలుగా పిల్లలతో విడిగా నివసిస్తోంది.
ఈ క్రమంలో చిన్న కుమార్తె భర్త బంగారు హరి, దుర్గతో చనువుగా ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు మందలించారు. అనంతరం దుర్గ హరికి దూరంగా ఉండటంతో అతడు ఆమెపై కోపం పెంచుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. 2024 జనవరి 30న మధ్యాహ్న సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న దుర్గపై హరి తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేసి గొంతు కోసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు.
అప్పటి పటమట ఇన్‌స్పెక్టర్ డీకేఎన్ మోహన్ రెడ్డి కేసును దర్యాప్తు చేసి, సిబ్బందితో కలిసి 2024 ఫిబ్రవరి 13న నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
విచారణలో నిందితుడిపై నేరం రుజువవడంతో మహిళా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జి. రాజేశ్వరి సోమవారం జీవిత ఖైదు, రూ.1,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. జ్ఞానాంబ వాదనలు వినిపించారు. సిఎంఎస్ ఇన్‌స్పెక్టర్ జగదీశ్వరరావు, ప్రస్తుత పటమట ఇన్‌స్పెక్టర్ పవన్ కిషోర్, సిఎంఎస్ సిబ్బంది పర్యవేక్షణలో మొత్తం 9 మంది సాక్షులను విచారించారు.

