విజయవాడ నడిబొడ్డున కాలువ పూడ్చివేతపై వివాదం
గాంధీనగర్ జీఎస్ రాజు రోడ్డులో కాలువ విస్తీర్ణం తగ్గిస్తున్నారంటూ ఆరోపణలు... ఫ్లవర్ మార్కెట్ కోసం 80 దుకాణాల నిర్మాణ ప్రయత్నమని స్థానికుల అభ్యంతరం... ఇరిగేషన్, కార్పొరేషన్ అధికారులు వెంటనే పరిశీలించి లీజ్ రద్దు చేయాలని డిమాండ్...

విజయవాడ, సెప్టెంబరు 7: నగర నడిబొడ్డున గాంధీనగర్ జీఎస్ రాజు రోడ్డులోని కెనాల్ కాలువ గట్టుపై చేపడుతున్న నిర్మాణాలపై వివాదం నెలకొంది. గతంలో రైతుబజార్‌గా వినియోగించిన స్థలం ప్రస్తుతం ఖాళీగా ఉండగా, ఆ ప్రాంతాన్ని ఫ్లవర్ మార్కెట్‌కు కేటాయించి దుకాణాల నిర్మాణం చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
స్థానికుల వాదన ప్రకారం, సుమారు 25 నుంచి 30 అడుగుల వెడల్పు ఉన్న ప్రాంతాన్ని కాలువ వైపు పూడ్చి దాదాపు 60 అడుగులకు విస్తరించి సుమారు 80 దుకాణాలు నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి దీర్ఘకాల లీజ్ మంజూరైందని, కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం రాజీవ్ గాంధీ పార్క్ సమీపంలో కొనసాగుతున్న హోల్‌సేల్ పూల వ్యాపారాన్ని గాంధీనగర్ ప్రాంతానికి తరలిస్తే ఇప్పటికే రద్దీగా ఉండే ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూల వ్యర్థాలు, చెత్త తరలింపు కూడా సమస్యగా మారవచ్చని చెబుతున్నారు.
కాలువ విస్తీర్ణాన్ని తగ్గించేలా పూడ్చివేతలు జరిగితే నీటి ప్రవాహం, డ్రైనేజీ వ్యవస్థ, పర్యావరణంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇరిగేషన్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే స్థలాన్ని పరిశీలించి, అనుమతులు, లీజ్ నిబంధనలు, కాలువ హద్దులను బహిర్గతం చేయాలని కోరుతున్నారు.
అక్రమంగా కాలువ ప్రాంతం వినియోగిస్తున్నట్లు తేలితే లీజ్‌ను రద్దు చేసి కాలువను యథాస్థితికి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.

