చిల్లె రాజ్‌కుమార్ సేవలు మరువలేనివి
ప్రథమ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి... ఎస్సీ కమిషన్ సభ్యుడు చెల్లెం ఆనంద్ ప్రకాష్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ హాజరు... దళిత యువత చదువు, చైతన్యం, వ్యసనాల నివారణపై దృష్టి పెట్టాలని పిలుపు...

పెనుమంచిలి జార్జిపేట, సెప్టెంబరు 7: వైఎస్సార్సీపీ నాయకుడు, మాల మహానాడు జిల్లా కార్యదర్శి చిల్లె రాజ్‌కుమార్ ప్రథమ వర్ధంతి సందర్భంగా జార్జిపేటలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ సభ్యుడు చెల్లెం ఆనంద్ ప్రకాష్, మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్‌కుమార్ పార్టీ కోసం, సమాజం కోసం, దళితుల అభ్యున్నతి కోసం చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. సమాజానికి సేవ చేసిన వ్యక్తి తమ మధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు.
దళిత యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, చదువును ప్రధాన ఆయుధంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం విద్య కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ కొంతమంది దళిత యువత చదువుకు దూరమవుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలని, చదువుతో పాటు సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. గంజాయి, మద్యం తదితర వ్యసనాలకు దూరంగా ఉన్నప్పుడే కుటుంబాలు, సమాజం అభివృద్ధి దిశగా సాగుతాయని అన్నారు.
రాబోయే రోజుల్లో దళితవాడల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువతను చైతన్యపరిచేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో మాల మహానాడు ఆచంట నియోజకవర్గ అధ్యక్షుడు కుసుమ వెంకటేశ్వరరావు, పాస్టర్ గోడి సునీల్ కుమార్, సంఘ నాయకులు సీఆర్ బాబురావు, సాక జయప్రకాశ్, సాక బాబు రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

