కార్యకర్తల కుటుంబాలకు అండగా టీడీపీ: బొండా ఉమా
మంద శ్రీనివాస్ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం… కార్యకర్తల సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కు అందజేత… కష్టకాలంలో కార్యకర్తలను ఆదుకోవడం తమ బాధ్యతన్న ఎమ్మెల్యే…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, అక్టోబర్ 7: కార్యకర్తల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన టీడీపీ కార్యకర్త మంద శ్రీనివాస్ కుటుంబానికి పార్టీ కార్యకర్తల సహాయ నిధి నుంచి మంజూరైన రూ.లక్ష చెక్కును బుధవారం సాయంత్రం బీఆర్టీఎస్ రోడ్డులోని తన కార్యాలయంలో అందజేశారు. 25వ డివిజన్ దుర్గా అగ్రహారం అనపర్తివారి వీధికి చెందిన శ్రీనివాస్ (38) మృతి సమయంలో కుటుంబాన్ని పరామర్శించి, పార్టీ తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చినట్లు బొండా ఉమా తెలిపారు. ఆ హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కార్యాలయం ద్వారా మంజూరైన

సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందించినట్లు పేర్కొన్నారు. పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలకు, వారి కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలవడం తమ బాధ్యతని అన్నారు. కార్యకర్తల సంక్షేమానికి చంద్రబాబునాయుడు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. శ్రీనివాస్ అకాల మరణం కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆర్థిక సహాయం అందించినందుకు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, డివిజన్ అధ్యక్షుడు మాచర్ల గోపి, మాచర్ల పావని, దొంగర ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

