గ్రంథాలయాల బలోపేతానికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు
▪️ గ్రంథాలయ సెస్ నిధులు నేరుగా జిల్లా సంస్థలకు జమ చేయడం చారిత్రాత్మకం: ఎం.ఎస్. బేగ్ ▪️ 175 నియోజకవర్గాల్లో గ్రంథాలయాల ఏర్పాటుతో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ప్రయోజనం ▪️ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ పరిషత్ కృతజ్ఞతలు

విజయవాడ, ఆగస్టు 21 : రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధి, బలోపేతానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎం.ఎస్. బేగ్ అన్నారు. ముఖ్యంగా గ్రంథాలయ సెస్ ద్వారా సమకూరే నిధులను నేరుగా జిల్లా గ్రంథాలయ సంస్థలకు జమ చేయాలన్న నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొంటూ హృదయపూర్వకంగా స్వాగతించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న గ్రంథాలయాలను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందన్నారు. దీనివల్ల విద్యార్థులు, నిరుద్యోగ యువత, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు, పాఠకులకు అవసరమైన విజ్ఞాన వనరులు మరింత చేరువవుతాయని తెలిపారు. గ్రంథాలయాలు కేవలం పుస్తక పఠన కేంద్రాలకే పరిమితం కాకుండా విద్య, విజ్ఞానం, ఉపాధి అవకాశాలు, పోటీ పరీక్షల సన్నద్ధత, డిజిటల్ విద్యకు కేంద్రాలుగా రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉందని బేగ్ పేర్కొన్నారు. నిధులు సకాలంలో అందుబాటులోకి వస్తే పుస్తకాలు, కంప్యూటర్లు, డిజిటల్ వనరులు, ఫర్నిచర్, పఠన మందిరాలతో పాటు తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర గ్రంథాలయ రంగానికి కొత్త దిశ ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ పరిషత్ తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. గ్రంథాలయాల బలోపేతానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు ఎం.ఎస్. బేగ్ కృతజ్ఞతలు తెలిపారు.

