విజయవాడ నగర కాంగ్రెస్‌కు కొత్త సారథ్యం
నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నరహరిశెట్టి నరసింహారావు మరోసారి నియామకం.. 36 మందితో నూతన కార్యవర్గానికి వైఎస్ షర్మిల రెడ్డి ఆమోదం... నగరంలోని 64 డివిజన్లకు కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం...

విజయవాడ: విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ఆమోదం తెలిపారు. నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఏఐసీసీ సభ్యుడు నరహరిశెట్టి నరసింహారావును మరోసారి నియమించారు.
ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కార్యనిర్వాహక కార్యదర్శి, కోశాధికారితో కలిపి మొత్తం 36 మందితో కూడిన నూతన కార్యవర్గ జాబితాను ఆదివారం విడుదల చేశారు. అదే విధంగా విజయవాడ నగరంలోని 64 డివిజన్లకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమిస్తూ షర్మిల రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ నగరంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్తామన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నూతన కమిటీ సమిష్టిగా కృషి చేస్తుందని తెలిపారు.
నూతన కమిటీకి ఆమోదం తెలిపిన వైఎస్ షర్మిల రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన, నగరంలో కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా ప్రతి సభ్యుడు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

