భవానీ భక్తులపైకి దూసుకెళ్లిన స్కార్పియో నలుగురు దుర్మరణం
విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్తుండగా ఘోర విషాదం.... బస్సు మరమ్మతుల కోసం ఆగడంతో టీ తాగేందుకు దిగిన భక్తులు... కత్తిపూడి వద్ద వేగంగా వచ్చిన స్కార్పియో ఢీ.. నలుగురి మృతి...

కత్తిపూడి, అక్టోబర్ 22: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని కత్తిపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తున్న భవానీ భక్తుల్లో నలుగురు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విజయనగరం జిల్లా డెంకాడ నుంచి భవానీ భక్తులతో బయలుదేరిన ప్రైవేటు బస్సులో మార్గమధ్యంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపి మరమ్మతులు చేపట్టాడు. ఈ సమయంలో కొందరు భక్తులు టీ తాగేందుకు బస్సు దిగి సమీపంలోని దుకాణం వైపు వెళ్తుండగా వేగంగా దూసుకొచ్చిన స్కార్పియో వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు భవానీ భక్తులు మృతి చెందారు. అమ్మవారి దర్శనం కోసం భక్తిశ్రద్ధలతో బయలుదేరిన భక్తులు మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాద సమాచారం అందుకున్న ప్రత్తిపాడు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

