పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన దీపావళి!
సత్యనారాయణపురంలో 200 మంది నిరుపేదలకు దుప్పట్లు, మిఠాయిల పంపిణీ... పండుగ ఆనందాన్ని పేదలతో పంచుకున్న యువనేత బొండా సిద్ధార్థ... సేవా కార్యక్రమాలతోనే సమాజంలో మానవత్వం వెల్లివిరుస్తుందన్న సిద్ధార్థ...

విజయవాడ, నవంబర్ 7: దీపావళి పండుగ సందర్భంగా పేదల జీవితాల్లో ఆనందాన్ని నింపేందుకు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ ముందుకొచ్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 71వ డివిజన్ సత్యనారాయణపురంలో చారిత్రక బాబురావు మేడ యజమాని రాజరమణి ఆధ్వర్యంలో శనివారం సేవా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బొండా సిద్ధార్థ సుమారు 200 మంది నిరుపేదలకు దుప్పట్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిద్ధార్థ మాట్లాడుతూ దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదని, పేదల జీవితాల్లో వెలుగులు నింపే పండుగ అని పేర్కొన్నారు. పండుగ వేళ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు. పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే నిజమైన పండుగ ఆనందమని తెలిపారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో మానవత్వం, సోదరభావం, సేవా స్ఫూర్తి మరింత బలపడతాయని సిద్ధార్థ అభిప్రాయపడ్డారు. నిరుపేదలకు చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చిన రాజరమణిని ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 71వ డివిజన్ కార్పొరేటర్ గార్లపాటి ఊర్మిళ, డివిజన్ పార్టీ ఇన్‌చార్జి గార్లపాటి విజయకుమార్, గుడిపాటి దత్తు, జె. రామలక్ష్మి, ఫణి తదితరులు పాల్గొన్నారు.

