స్వచ్ఛతలో ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ గుర్తింపు!
రాష్ట్రానికి ఆరు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు… జాబితాలో విజయవాడ సహా ఐదు నగరపాలక సంస్థలు, కుప్పం పురపాలక సంఘం… ఈ నెల 11న రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాల ప్రదానం: పట్టాభిరామ్…

అమరావతి, నవంబర్ 7: స్వచ్ఛత, పారిశుధ్య నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వెల్లడించారు. రాష్ట్రానికి ఆరు జాతీయ స్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రకటించినట్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి నగరపాలక సంస్థలతో పాటు కుప్పం పురపాలక సంఘం ఈ పురస్కారాలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సూచనలతో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమానికి ఈ అవార్డులు గుర్తింపుగా నిలిచాయని పట్టాభిరామ్ అభిప్రాయపడ్డారు. ప్రజల భాగస్వామ్యం, మున్సిపల్ యంత్రాంగాల నిరంతర కృషితో పారిశుధ్య నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో మార్పులు సాధ్యమయ్యాయని తెలిపారు. పారిశుధ్య కార్మికుల కృషికి గుర్తింపు ఈ నెల 11న ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదాన కార్యక్రమం జరుగుతుందని పట్టాభిరామ్ వెల్లడించారు. ఈ పురస్కారాల సాధనలో కీలక పాత్ర పోషించిన పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వివిధ స్థాయిల్లో పనిచేసిన అధికారులు, సిబ్బంది, స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములైన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర ఉద్యమాన్ని మరింత విస్తృతంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు.

