నకిలీ వైద్యులపై శ్వేతపత్రం విడుదల చేయాలి!
అనంతపురంలో వృద్ధురాలి మృతిపై సమగ్ర విచారణ జరపాలి… గత ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను బహిర్గతం చేయాలి… 15 రోజుల్లోగా చర్యల నివేదిక విడుదల చేయాలి: డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్…

విజయవాడ, అక్టోబర్ 24: రాష్ట్రంలో నకిలీ వైద్యుల కార్యకలాపాలపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. అనంతపురంలో ప్రథమ చికిత్స కేంద్రంలో ఇంజెక్షన్ తీసుకున్న అనంతరం ఓ వృద్ధురాలు మృతి చెందినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను గుర్తించాలని కోరారు. గతంలో నకిలీ వైద్యులపై అందిన ఫిర్యాదులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ తీసుకున్న చర్యలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదుల స్వీకరణ తేదీలు, నిర్వహించిన తనిఖీలు, చర్యల్లో జాప్యానికి గల కారణాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. వైద్య నియంత్రణ వ్యవస్థలో లోపాలు ఉన్నాయా అనే అంశంపైనా నిష్పాక్షిక విచారణ జరగాలని కోరారు. 2025 జనవరి నుంచి ఇప్పటివరకు జిల్లాల వారీగా నమోదైన ఫిర్యాదులు, తనిఖీలు, మూసివేసిన అనధికార వైద్య కేంద్రాలు, క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసిన కేసులు, అనుమానాస్పద మరణాల వివరాలను వెల్లడించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. పెండింగ్ ఫిర్యాదులను సమీక్షించి 15 రోజుల్లోగా చర్యల నివేదిక విడుదల చేయాలన్నారు. అర్హతలేని వ్యక్తులు వైద్యులుగా చలామణి అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. విచారణలో నిర్లక్ష్యం లేదా జాప్యం నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సమర్పించిన వినతిపత్రం ప్రతులను జాతీయ వైద్య కమిషన్ కార్యదర్శికి పంపినట్లు డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ తెలిపారు.

