65వ డివిజన్‌లో కూటమి ఎన్నికల ప్రచారం
కార్పొరేటర్ అభ్యర్థి వల్లభనేని రాజేశ్వరి తరఫున బొండా రవితేజ ప్రచారం... ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పనకే ప్రాధాన్యం... ప్రజల ఆదరణతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుదామని పిలుపు...

విజయవాడ, అక్టోబర్ 24 : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 65వ డివిజన్‌లో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం శనివారం ఉత్సాహంగా సాగింది. మారుతీనగర్ మాగంటి వారి వీధి నుంచి ప్రారంభమైన ప్రచారంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి వల్లభనేని రాజేశ్వరితో కలిసి యువ నాయకుడు బొండా రవితేజ పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బొండా రవితేజ మాట్లాడుతూ నగర అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే ప్రజాప్రతినిధుల బాధ్యతని పేర్కొన్నారు. 65వ డివిజన్ అభివృద్ధికి రాజేశ్వరి కృషి చేస్తారని తెలిపారు. ఈ ప్రచారంలో స్థానిక టీడీపీ నాయకులు, కూటమి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
