దసరా క్యూలైన్ల పనులకు శ్రీకారం
వినాయకుడి ఆలయం, ఘాట్‌రోడ్డు వద్ద శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన ఈవో వి.కె. శీనా నాయక్ భక్తులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశం


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 13: ఇంద్రకీలాద్రిపై ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు–2026’ ఏర్పాట్లలో భాగంగా భక్తుల క్యూలైన్ల నిర్మాణ పనులను ఆదివారం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. దసరా ఉత్సవాల సందర్భంగా క్యూలైన్లు ప్రారంభమయ్యే వన్‌టౌన్ కెనాల్ రోడ్డులోని వినాయకుడి ఆలయం వద్ద పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఆలయ వైదిక కమిటీ నిర్ణయించిన శుభముహూర్తం ప్రకారం ఉదయం 7.30 గంటలకు ఘాట్‌రోడ్డు ప్రారంభ ప్రాంతంలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో గణపతి పూజతోపాటు వైదిక క్రతువులు నిర్వహించారు. పూజల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా

నాయక్ పాల్గొని కొబ్బరికాయ కొట్టి క్యూలైన్ల నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. దసరా ఉత్సవాలు నిర్విఘ్నంగా, విజయవంతంగా సాగాలని గణనాథుడిని ప్రార్థించారు. దసరా నవరాత్రులకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లు, బారికేడ్లు, చలువ పందిళ్లు, తాగునీటి వసతి తదితర ఏర్పాట్లను నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పూర్తిచేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించినట్లు ఈవో తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ ఎల్.రమాదేవి, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు అశోక్‌కుమార్, రవీంద్ర, సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్ మస్తాన్‌తోపాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

