కూలిన గోడ..
45వ డివిజన్లో కూలిన రిటైనింగ్ వాల్.... ఘటనా స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రి వెలంపల్లి.... వెంటనే పునర్నిర్మించి నడక మార్గం ఏర్పాటు చేయాలని డిమాండ్....


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 14: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 45వ డివిజన్ కొండబడి ఎదురుగా ఉన్న కొండ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గోడ నానిపోయి ఒక్కసారిగా కూలడంతో మట్టి, రాళ్లు మార్గానికి అడ్డంగా పడ్డాయి. దీంతో కొండ ప్రాంత ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.
విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరింత మట్టి జారిపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అనంతరం మున్సిపల్ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడిన వెలంపల్లి, కూలిన గోడ శిథిలాలను యుద్ధప్రాతిపదికన తొలగించాలని కోరారు. పటిష్టమైన కొత్త రిటైనింగ్ వాల్‌ను వెంటనే నిర్మించడంతో పాటు కొండ ప్రాంత ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా శాశ్వత నడక మార్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే స్థానిక ప్రజలతో కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ అధ్యక్షుడు సరగడ శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

