గుడివాడ గణపయ్య వచ్చాడయ్యా
ప్రత్యేక వినాయక గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ‘స్వచ్ఛ గుడివాడ–ప్రకృతిని కాపాడదాం’ అంటూ సందేశం మట్టి విగ్రహాలతో పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపు


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గుడివాడ, సెప్టెంబర్ 13: వినాయక చవితి సందర్భంగా గుడివాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన ‘గుడివాడ గణపయ్య వచ్చాడయ్యా’ ప్రత్యేక గీతాన్ని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదివారం ప్రజావేదికలో ఆవిష్కరించారు. మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, కూటమి నాయకులతో కలిసి పాటను విడుదల చేశారు. ‘స్వచ్ఛ గుడివాడ–ప్రకృతిని కాపాడదాం’ అనే సందేశంతో భక్తి, పర్యావరణ పరిరక్షణ అంశాలను మేళవిస్తూ ఈ గీతాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి కరుణతో ప్రజల కష్టాలు తొలగి ప్రతి కుటుంబం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గణపతి మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తోందని, ఉత్సవ నిర్వాహకులు నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో వేడుకలు

నిర్వహించాలని సూచించారు. మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. పండుగ సందర్భంగా స్వచ్ఛతకు ప్రాధాన్యమివ్వడంతో పాటు వేడుకల అనంతరం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. పురపాలక, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా వినాయకుడి ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గుడివాడ మరింత అభివృద్ధి చెందాలని కోరారు. పర్యావరణ సందేశంతో ప్రత్యేక గీతాన్ని రూపొందించిన మున్సిపల్ అధికారులను అభినందించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, జనసేన ఇన్‌ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు పండ్రాజు సాంబయ్య, బీజేపీ నాయకుడు అంగడాల సతీష్‌తో పాటు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

