ఎంఎస్ఎంఈ పేరుతో భారీ వసూళ్ల ఆరోపణలు
ఎంఎస్ఎంఈ డైరెక్టర్‌నని నమ్మించి డబ్బులు వసూలు చేశారంటూ ఆరోపణలు... రూ.లక్షకు రూ.5 లక్షల రుణం ఇప్పిస్తామంటూ మోసం చేశారని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు... తిరువూరుకు చెందిన వ్యక్తిపై ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పలువురు బాధితుల ఆరోపణలు...

విజయవాడ, సెప్టెంబరు 8: ఎంఎస్ఎంఈ డైరెక్టర్‌నని పరిచయం చేసుకుని భారీగా రుణాలు ఇప్పిస్తామంటూ తమ నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశారని పలువురు బాధితులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు.
తిరువూరుకు చెందిన ఓ వ్యక్తి తనను ఎంఎస్ఎంఈ డైరెక్టర్‌గా పరిచయం చేసుకుని, రూ.లక్ష చెల్లిస్తే రూ.5 లక్షల వరకు రుణం ఇప్పిస్తానని నమ్మబలికినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన మాటలు నమ్మి పలువురు డబ్బులు చెల్లించినప్పటికీ రుణాలు ఇప్పించలేదని ఆరోపించారు.
ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పలువురిని గ్రూపులుగా ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఎంతకాలమైనా రుణాలు రాకపోవడంతో తాము మోసపోయామని గుర్తించినట్లు పేర్కొన్నారు.
తాము చెల్లించిన డబ్బులు తిరిగి అడిగితే ‘దిక్కున్న చోట చెప్పుకోండి’ అంటూ బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై అధికారులు సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలికితీసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

