మెగా డీఎస్సీపై దుష్ప్రచారం తగదు
148 రోజుల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి... మెరిట్, పారదర్శకతకే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం... నిరుద్యోగుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దు: తంగిరాల సౌమ్య...

మంగళగిరి, సెప్టెంబరు 8: మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిరుద్యోగుల శ్రమను అవమానించేలా ఉన్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విమర్శించారు. డీఎస్సీ నియామక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించామని, మెరిట్‌కే ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకంతో మెగా డీఎస్సీకి శ్రీకారం చుట్టారని చెప్పారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో కేవలం 148 రోజుల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేశామని పేర్కొన్నారు.
నోటిఫికేషన్ విడుదల నుంచి ఆన్సర్ కీలు, అభ్యంతరాల స్వీకరణ, గ్రీవెన్స్ పరిష్కారం, మెరిట్ జాబితాల విడుదల వరకు ప్రతి దశను బహిరంగంగా నిర్వహించామని సౌమ్య తెలిపారు. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగానే ఎంపికలు జరిగాయని స్పష్టం చేశారు.
డీఎస్సీ ప్రక్రియను అడ్డుకునేందుకు వైసీపీ 335 పిటిషన్లు దాఖలు చేయించిందని ఆమె ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడటం సరికాదని హితవు పలికారు.
గత ప్రభుత్వ హయాంలో జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించిన సౌమ్య, కూటమి ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో మెరిట్, పారదర్శకతకు పెద్దపీట వేస్తోందన్నారు. మెగా డీఎస్సీ ద్వారా వేలాది కుటుంబాల్లో ఆశలు నింపామని పేర్కొన్నారు.

