నేర పరిశోధనలో పక్కా సాక్ష్యాలే కీలకం
పోలవరం సర్కిల్ పోలీసులకు ప్రత్యేక పరేడ్, నేర పరిశోధనపై శిక్షణ నేరస్థల పరిశీలన నుంచి భౌతిక సాక్ష్యాల భద్రత వరకు అవగాహన సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు నాణ్యత పెంచాలి: డీఎస్పీ కె. జయకృష్ణ

పోలవరం, ఆగస్టు 21 (ఆంధ్రప్రభ): నేర పరిశోధనలో శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తూ, న్యాయస్థానంలో నిలిచే విధంగా సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించాలని పోలవరం డీఎస్పీ కె. జయకృష్ణ పోలీసు సిబ్బందికి సూచించారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం కార్మిల్‌పురంలోని సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాల మైదానంలో పోలవరం సర్కిల్ పోలీసులకు ప్రత్యేక పరేడ్‌తో పాటు నేర పరిశోధనపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పోలవరం డీఎస్పీ కె. జయకృష్ణ పర్యవేక్షణలో, పోలవరం ఎస్సై పి. అప్పారావు, కొయ్యలగూడెం ఎస్సై వి. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణలో నేరస్థల పరిశీలనకు సంబంధించిన పలు కీలక అంశాలను వివరించారు. నేరస్థలాన్ని శాస్త్రీయ పద్ధతిలో పరిశీలించడం, ఫొటోలు తీయడం, భౌతిక సాక్ష్యాలను సేకరించి భద్రపరచడం, రఫ్‌స్కెచ్ రూపొందించడం, సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. నేర దర్యాప్తులో చిన్న ఆధారం కూడా కీలకంగా మారే అవకాశం ఉన్నందున సాక్ష్యాల సేకరణలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సేకరించిన ఆధారాలు న్యాయస్థానంలో నిలిచేలా చట్టపరమైన విధానాలను పాటిస్తూ దర్యాప్తును పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ జయకృష్ణ మాట్లాడుతూ పోలీసులు సమయపాలన, క్రమశిక్షణ పాటిస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు. మారుతున్న నేర స్వభావానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని దర్యాప్తు నాణ్యతను మరింత పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సైలు పి. అప్పారావు, వి. చంద్రశేఖర్‌తో పాటు పోలవరం సర్కిల్‌కు చెందిన పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
