కాంగ్రెస్ అభ్యర్థుల విజయం ఖాయం: పల్లంరాజు
అవినీతి రహిత పాలన కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలి… 76, 77, 79వ డివిజన్లలో కాంగ్రెస్ నేతల విస్తృత ప్రచారం… అజిత్‌సింగ్‌నగర్, వాంబే కాలనీల్లో రోడ్‌షో, ఇంటింటి ప్రచారం…

విజయవాడ, అక్టోబర్ 26: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థుల విజయం ఖాయమని మాజీ కేంద్రమంత్రి ఎం.ఎం. పల్లంరాజు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం అజిత్‌సింగ్‌నగర్, వాంబే కాలనీ ప్రాంతాల్లోని 76, 77, 79వ డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున నిర్వహించిన రోడ్‌షో, ఇంటింటి ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. 76వ డివిజన్ అభ్యర్థి షేక్ జాఫర్, 77వ డివిజన్ అభ్యర్థి జెరోమీ కిరణ్, 79వ డివిజన్ అభ్యర్థి షేక్ కరీమున్నీసాతో కలిసి ఓటర్లను కలిశారు. ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పల్లంరాజు మాట్లాడుతూ విజయవాడలో కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు ఆధ్వర్యంలో రాష్ట్ర, నగర, స్థానిక నాయకులు సమన్వయంతో ప్రచారం నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఆలోచించి అవినీతి రహిత పాలన కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. నగర అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థుల విజయం అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, ఏఐసీసీ నాయకుడు కొలనుకొండ శివాజీ, సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జి మీసాల రాజేశ్వరరావు, నగర ఉపాధ్యక్షులు అబ్దుల్లా అన్సారీ, సుభాష్, కే. గణేష్, 74వ డివిజన్ అభ్యర్థి డి.వి. సాయికృష్ణ, 78వ డివిజన్ అధ్యక్షుడు షేక్ మహబూబ్ వలి, స్థానిక నాయకులు షేక్ నాగూర్, కిరణ్‌తో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

