ప్రేమ.. కరుణ.. సేవకు నిలువెత్తు రూపం మదర్ థెరిసా
మానవత్వానికి ఆమె జీవితం ఆదర్శం: తోలేటి శ్రీకాంత్... విజయవాడలో ఘనంగా మదర్ థెరిసా జయంతి వేడుకలు... చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు...

విజయవాడ, ఆగస్టు 26: ప్రేమ, కరుణ, సేవ, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మదర్ థెరిసా జీవితమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తోలేటి శ్రీకాంత్ అన్నారు.
మదర్ థెరిసా జయంతిని పురస్కరించుకుని బుధవారం విజయవాడలోని కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత మదర్ థెరిసా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తోలేటి శ్రీకాంత్ మాట్లాడుతూ పేదలు, అనాథలు, నిరాశ్రయులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సేవ చేయడమే మదర్ థెరిసా తన జీవిత లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు. 1950లో మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థను స్థాపించి సమాజంలో నిరాదరణకు గురైన వారికి ప్రేమ, ఆప్యాయత, సేవలను అందించారని గుర్తుచేశారు.
‘మానవ సేవే మాధవ సేవ’ అనే భావనకు తన జీవితాన్నే ఉదాహరణగా నిలిపిన మహనీయురాలు మదర్ థెరిసా అని కొనియాడారు. ఆమె చేసిన విశిష్ట సేవలకు 1979లో నోబెల్ శాంతి బహుమతి లభించగా, భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో సత్కరించిందన్నారు.
కులం, మతం, ప్రాంతం అనే భేదాలు లేకుండా బాధలో ఉన్న ప్రతి మనిషికి ప్రేమతో సేవ చేయాలన్నదే మదర్ థెరిసా అందించిన గొప్ప సందేశమన్నారు. ఆమె ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైనంత మేరకు పేదలు, నిరాశ్రయులకు అండగా నిలవాలని శ్రీకాంత్ పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ చేతివృత్తుల విభాగం అధ్యక్షుడు జవ్వాది సుధీర్, యంగ్ ఇండియా యూత్ సభ్యులు గాదె గణేష్ యాదవ్, అవ్వారు జోజిబాబు, చింతలూరి మోహన్, అమ్మెర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

